వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఈసారి ఒక్కసారిగా రూ.195 పెరిగినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. బుధవారం నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇటీవలే రూ.114.5 పెంపు జరిగిన నేపథ్యంలో, మళ్లీ ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన ప్రతీసారి గృహ వినియోగ గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయనే భయం ప్రజల్లో ఉంది. గతంలో కూడా వాణిజ్య ధరలు పెరిగిన వెంటనే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గ్యాస్ ధరల భారం పెరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ క్లారిటీ ఇస్తూ, డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా యథాతథంగా ఉంటాయని తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రమే పెరిగినట్లు వివరించింది.