ఇండోనేషియాలో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో సముద్రం అడుగున 7.4 తీవ్రతతో భూమి కంపించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో పలు దేశాలకు సునామీ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి

భూకంప కేంద్రం మొలుక్కా సముద్రంలో టెర్నెట్ ద్వీపానికి సుమారు 127 కిలోమీటర్ల దూరంలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యూఎస్ పర్యవేక్షణ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. భూకంప కేంద్రానికి సుమారు 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి.

హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలు ప్రమాద పరిధిలోకి రావచ్చని తెలిపింది. దీంతో ఈ మూడు దేశాల ప్రభుత్వాలు వెంటనే సునామీ అలర్ట్ జారీ చేసి తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.

అధికారులు తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల్లో అత్యవసర బందోబస్తు ఏర్పాట్లు చేసి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితిని అధికారులు క్షణక్షణం పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ తెలియజేస్తామని అధికారులు తెలిపారు.